అసంతృప్తి పై క్లారిటీ ఇస్తున్న తెరాస నేతలు

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై మాజీ హోంమంత్రి నాయినీ నరసింహ్మారెడ్డి, జోగు రామన్న, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి,సహా కొందరు నాయకులు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో స్వయంగా మాజీ మంత్రి రాజయ్య మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. తాను అనని మాటలను మీడియాలో చూపించడం బాధ కలిగించిందని చెప్పారు. కేసీఆరే తమ నాయకుడని.. మాదిగలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని స్పష్టంచేశారు.

మాజీ మంత్రి రాజయ్య మీడియాతో మాట్లాడుతూ.." నేను వందకు వంద శాతం కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నా. మాదిగలకు త్వరలోనే మరిన్ని ఉన్నత పదవులు వస్తాయని ఆశిస్తున్నా. కెసిఆర్ అందరికీ న్యాయం చేస్తారు. మాదిగ జాతి కెసిఆర్ పై ఆశాభావంతో ఉంది. అందరికీ ఒకే సారి అవకాశాలు రావు. నా హోదాకు తగ్గట్టు తగిన పదవి ఇస్తామని కెసిఆర్, కేటీఆర్ భరోసా ఇచ్చారు. మాదిగలకు మంద కృష్ణ ఒక్కడే ప్రతినిధి కాదు ..నేను అంతకన్నా పెద్ద వాడినే. నేను కెసిఆర్‌కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు" అన్నారు

అలాగే ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ... మంత్రివర్గ ఏర్పాటు పూర్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యం అని చెప్పారు. టీఆర్‌ఎస్‌లో చేరింది పదవుల కోసం కాదు.. నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమేనని వివరించారు. పదవుల కన్నా పార్టీ బలోపేతంపైనే దృష్టిపెడతానని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆశిస్సులతోనే తమ కుటుంబానికి జెడ్పీ ఛైర్మన్ పదవి దక్కిందని తెలిపారు. తాను అనని మాటలను అన్నట్లుగా ప్రచారం చేయొద్దని ఎమ్మెల్యే కోరారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.