బీజేపీ - టీడీపీ తిరిగి ఒకటవుతున్నారు

బీజేపీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పంధా అవలంభిస్తుంది. ముఖ్యంగా దక్షిణాదిలో ఎంతప్రయత్నిస్తున్నా ఎదగటంలేదనే ఆవేదన వాళ్లలో బలంగా వుంది. అందుకే ఏదోవిధంగా బలపడాలనే తాపత్రయం ఎక్కువయ్యింది. ఆ ఆతురత ఆంధ్ర రాష్ట్రంపై కూడా పడింది. వాస్తవానికి దక్షిణాదిలో అతి తక్కువ ప్రజాదరణ బీజేపీ కి ఆంధ్రప్రదేశ్ లోనే వుంది. దానికి అనేక కారణాలు వున్నాయి. విభజనలో ఇచ్చిన హామీలు అమలుచేయలేదనేది ప్రధానమైన అంశం. దానికి తోడు తెలుగు మీడియా , ఒక సంవత్సరం నుంచి తెలుగుదేశం తీసుకున్న వైఖరి కూడా తోడయ్యి ప్రజల్లో బీజేపీ ని విలన్ గా నిలబెట్టాయి. ఆ ప్రతికూల వాతావరణం నుంచి ఇప్పట్లో బయటకొచ్చే పరిస్థితి కనబడటం లేదు.

అందుకనే తెరచాటు రాజకీయాలకు శ్రీకారం చుట్టింది. ఇతర పార్టీల నాయకులకు గాలంవేస్తుంది. చేపలు ఒక్కొక్కటి వలలో పడుతున్నాయి. ముందుగా వ్యాపార ప్రయోజనాలున్న సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళను చేర్చుకుంది. అందులో ఓ పెద్ద ఎత్తుగడే ఉందంటున్నారు. చంద్రబాబునాయుడే వాళ్ళను పంపించాడని ప్రజలు గాఢంగా నమ్ముతున్నారు. తర్వాత పరిణామాలు కూడా అది నిజమేనని చెబుతున్నాయి. ఇటీవలే చంద్రబాబునాయుడు విశాఖపట్నం పార్టీ సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ నుంచి బయటకు రావటం పెద్దతప్పేనని ప్రకటించాడు. బీజేపీ కి దగ్గరకావాలనే తహ తహ చంద్రబాబునాయుడు మాటల్లో స్పష్టంగా కనబడుతుంది. ఇక రెండోవైపు చూస్తే ఆంధ్ర రాష్ట్ర బీజేపీ నాయకులు జగన్ పై ఒంటికాలు మీద లేస్తున్నారు. ఇది ప్రసుతమున్న రాజకీయ పరిస్థితి. ఇక తెరచాటు రాజకీయాలేంటో చూద్దాం.

ఇటీవల ఆంధ్ర జ్యోతి , ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి ల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ దాదాపు 45 నిముషాలపాటు అమిత్ షా తో భేటీ కావటం సంచలనంగా మారింది. బీజేపీ మీద అవకాశం దొరికితే కత్తులునూరే రాధాకృష ఒక్కసారి బీజేపి అధ్యక్షుడిని కలవటం సంచలనం కాకమరేంటి. దీనివెనకున్న రాజకీయంపై ఆంధ్ర దేశం లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. రాధాకృష్ణ వెళ్ళింది చంద్రబాబునాయుడు దూతగానేనని ప్రచారం జోరందుకుంది. చంద్రబాబునాయుడు ఒకేసారి ప్రత్యక్షంగా అమిత్ షా ని కలవలేడు కాబట్టి రాధాకృష్ణతో రాయబారం నెరపుతున్నాడని అందరూ అనుకుంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని అనుకోవటం విన్నాం కానీ ఇంతగా ప్రజల్ని వెర్రిపప్పులు చేస్తారని తెలియదు. మొన్నటి లోక్ సభ ఎన్నికలకు ముందు వేమూరి రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు రోజూ మోడీపై దుమ్మెత్తి పోయటం ఇంకా జనం మరిచిపోక ముందే ప్లేటు ఫిరాయిస్తారని ఎవరూ అనుకోలేదు. ఇంతవరకు ఓకే . మరి దీని పర్యవసానం బీజేపీ లో ఇంకోలా వుంది.

బీజేపీ ఆంధ్ర రాజకీయాల్లో ఓ వ్యూహాన్ని అనుసరించింది. బలీయమైన రెండు ప్రదాన సామాజిక వర్గాలైన రెడ్లు, కమ్మలు రెండు ప్రధానపార్టీలకింద సమీకరించబడటం తో సంఖ్యాపరంగా ఎక్కువగావున్న కాపు సామాజిక వర్గాన్ని దగ్గరకు తీయాలని వ్యూహం పన్నింది. అయితే మధ్యలో పవన్ కళ్యాణ్ ప్రవేశంతో అయోమయం ఏర్పడింది. అయినా వేరే ప్రత్యామ్నాయం లేకపోవటంతో కన్నా లక్ష్మీనారాయణకు అధ్యక్ష పదవిని కట్టబెట్టి కాపులకు దగ్గరకావాలనే ప్రయత్నం చేసింది. కానీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇప్పుడు కొత్త సమీకరణలతో కమ్మ సామాజిక వర్గానికి దగ్గరవుతున్నట్లు తెలుస్తుంది. ఇది రాష్ట్ర బీజేపీ లో ఇంకో కులపోరాటానికి తెరతీస్తోంది. కమ్మ సామాజిక వర్గం దగ్గరయితే కాపులు బీజేపీ కి దూరమయ్యే అవకాశముంది. అది జగన్ కి లాటరి టిక్కెట్టు తగిలినట్లే.

కాపులు స్వతంత్రంగా ఎదగాలని బలంగా కోరుకుంటున్నా అది ఇంతవరకు సాధ్యం కాలేదు. చిరంజీవి పై నమ్మకం పెట్టుకొని చివరకు నిరాశ చెందారు. మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వైపు కొంతమేర మొగ్గుచూపినా చివరలో తను వేసిన తప్పటడుగులతో కాపులు చీలిపోయారు. అయితే మెల్లి మెల్లిగా బీజేపీ వైపు మొగ్గు చూపటం మొదలయ్యింది. ఇటీవలే జనసేన నుంచి చింతల పార్ధసారధి కూడా బీజేపీ లో చేరటం జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కాపుల్లో పునరాలోచన లోకి నెట్టాయి . కమ్మ సామాజిక వర్గం దగ్గరయితే తిరిగి నాయకత్వం వాళ్ళ కిందకే వెళ్తుందనేది కాపుల్లో వుంది. అందుకే కన్నా లక్ష్మీనారాయణ కమ్మ సామాజిక వర్గ చేరికను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది చివరకు బీజేపీ కి పెద్ద తలనొప్పిగా మారబోతుందని అనుకుంటున్నారు. ఈ కొత్త కలయిక సామాజిక సమీకరణాల్లో జగన్ కి మేలు చేస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. కొద్దీ రోజులు పోతేగానీ వీటిపై మరింత స్పష్టత రాదు. అప్పటిదాకా వేచివుండాల్సిందే.

 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.