టీఆర్ఎస్ అగ్ర‌నాయ‌కుల‌పై బీజేపీ గురి!

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాల‌ని బీజేపీ పార్టీ అదిష్టానం ఉవ్విలూరుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ‌పై ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా ప్ర‌త్యేక దృష్టి సారించారు. పార్టీ స‌భ్య‌త్వ న‌మోదును హైద‌రాబాద్ నుంచే ప్రారంభించారు. అంతేగాక బ‌లం పెంచుకునేందుకు వివిధ పార్టీల నుంచి చేరిక‌ల‌ను కూడా పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ‌లో కాంగ్రెస్, టీడీపీల నుంచి పెద్ద సంఖ్య‌లో నాయ‌కులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

చాలా మంది నేత‌లు ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే కాస్త ప‌లుకుబ‌డి గ‌ల జ‌నాక‌ర్ష‌క నేత‌ల కోసం బీజేపీ అణ్వేషిస్తోంది. ఇందులో భాగంగా అధికార టీఆర్ఎస్ నాయ‌కుల‌పై ఆపార్టీ గురిపెట్టింది. ఎమ్మెల్యే, ఎంపీ స్ధాయి వ్య‌క్తుల‌ను పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నెల 17న తెలంగాణ విమోచ‌న దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్రానికి వ‌స్తున్న అమిత్‌షా స‌మ‌క్షంలో ప‌లువురు టీఆర్ఎస్ నాయ‌కులు కాషాయ కండువా క‌ప్పుకుంటార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తో పాటు గ్రేట‌ర్ హైద‌రాబాద్ టీఆర్ ఎస్ అ ధ్య‌క్షుడు, మ‌ల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు, నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ కాషాయ కండువా క‌ప్పునేందుకు రెడీ అయ్యార‌ని వార్త‌లు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ఈ ముగ్గురు నేత‌లు నాలుగు రోజుల క్రితం మ‌ల్కాజ్‌గిరిలోని మైనంప‌ల్లి కార్యాల‌యంలో స‌మావేశ‌మైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏకంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా జంప్ చేసేస్తార‌ని వ‌స్తోన్న వార్త‌లు గులాబీ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.