బీజేపీ ముస్లిం లకు దగ్గరవుతోందా ?

బీజేపీ మిషన్ 2024 తెలంగాణాలో అప్పుడే మొదలయ్యింది. బీజేపీ సభ్యత్వనమోదు కోసం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మొత్తం దేశంలో హైదరాబాదు నే ఎంచుకోవటం లోనే తెలంగాణను వచ్చే ఐదేళ్లలో బీజేపీ రాష్ట్రంగా చేయాలని దృఢంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అంతవరకూ అందరూ వూహిస్తుందే . కానీ ఈరోజు వచ్చిన వార్త చూస్తుంటే వాళ్ళ నిర్ణయాలు సంచలనంగా వున్నాయి.

బీజేపీ కి ముస్లిం శాఖ అయిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ పెద్దఎత్తున తెలంగాణాలో ప్రవేశించాలని చూస్తుంది. నాలుగు సంవత్సరాల కింద హైదరాబాద్ లో దాని శాఖ ప్రారంభించి ఇప్పటికి 3000 సభ్యులు వున్నట్లుగా చెప్పుకుంటున్నారు. పోయిన ఆదివారం పాతబస్తీ అఫ్జాల్ గంజ్ లో దాని సమావేశం జరిగింది. దాని కర్త, ఆర్ ఎస్ ఎస్ ముఖ్య నాయకుడైన ఇంద్రేశ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ సమావేశంలో అన్ని తెలంగాణ జిల్లాల్లో శాఖలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సంవత్సరాంతానికి తెలంగాణాలో 10000 సభ్యుల్ని చేర్పించాలని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సమావేశంలో ముస్లిం మతపెద్దలు కొంతమంది పాల్గొనటం ఆశ్చర్యం కలిగించింది. ముస్లిం మతపెద్ద మొయినుద్దీన్ షా ఖురేషి మాట్లాడుతూ ఇంద్రేశ్ కుమార్ తో మాట్లాడినతర్వాత చాలా సందేహాలు నివృత్తి అయినట్లు చెప్పాడు. త్వరలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ముస్లిం రాష్ట్రీయ మంచ్ శాఖను త్వరలో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ వార్త కొంత సంచలనంగా చెప్పొచ్చు. దీనికి ముందుగా రెండోసారి ఎన్నికైన తర్వాత మాట్లాడుతూ మోడీ మైనారిటీ ల్లో విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత మనందరిమీదా ఉందని చెప్పాడు. అలాగే వచ్చే అయిదు సంవత్సరాల్లో 5 కోట్ల ముస్లిం విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇవ్వాలని, మదరసాలలో ఆధునిక విద్య బోధించటానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని నిర్ణయించినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి సయ్యద్ నక్వి ప్రకటించాడు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే అర్ధమవుతుంది ఏమిటంటే ఈసారి బీజేపీ ముస్లిం ప్రజానీకంలోకి చొచ్చుకెళ్లి వాళ్ళ విశ్వాసం పొందాలని ఓ వ్యూహంగా నిశ్చయించుకుందని అర్ధమవుతుంది. ఇది దేశానికి మంచి పరిణామం. సమాజంలో కారణాలు ఏమైనప్పటికీ ఒక వర్గాన్ని పక్కన పెట్టటం మంచి పరిణామం కాదు. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీకికూడా మంచిదే. రెండోసారి అధికారం లోకివచ్చిన తర్వాత బీజేపీ ఓ పద్దతి ప్రకారం ముస్లిం లకు దగ్గరకావటానికి ప్రయత్నించటం ఆహ్వానించదగ్గ పరిణామం. అంతమాత్రాన ముస్లిం లు బీజేపీ కి దగ్గరవుతారని చెప్పలేము. కానీ ఈ ప్రయత్నమయితే మంచిదే. కొంతమంది పరిశీలకులు చెబుతున్నదానిప్రకారం వచ్చే అయిదు సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉండేటప్పుడు దానికి దూరంగా ఉండటం ముస్లిం కమ్యూనిటీ కి నష్టం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. అందుకనే ఇటీవల ప్రసిద్ధ ముస్లిం మేధావులు ఓ ప్రకటన ఇచ్చారు. మోడీ ఈ సారి తీసుకున్న చొరవను ఉపయోగించుకొని ప్రధాన స్రవంతిలో కలవటం ముస్లిం కమ్యూనిటీ కి మంచిదని సెలవిచ్చారు. బీజేపీ లో కొంతమంది తీవ్రవాదులు ఈ చొరవపై సంతోషంగా లేకపోయినా అటు ముస్లిం లకు , ఇటు మోడీకి ఇదో మంచి అవకాశం. దీన్ని వృధా చేసుకోకుండా వుపయోగించుకుంటే మంచిది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.