బెంగాల్ మార్గంలో ఖమ్మం కమ్యూనిస్టులు

కాలం మారుతుంది, దానితోపాటు సమాజమూ మార్పులకు లోనవుతుంది. ఆ టైం లో కొన్ని ఆశ్చర్యకర పరిణామాలు జరుగుతుంటాయి. ఆకోవకు చెందిందే ఖమ్మం లో జరుగుతున్న రాజకీయ పునరేకీకరణ. ఖమ్మం అంటేనే కమ్యూనిస్టుల కంచుకోట. భారత దేశం లో ఎన్ని కమ్యూనిస్టు పార్టీలున్నాయో వాటన్నిటి శాఖలు వుమ్మడి ఖమ్మం జిల్లాలో వున్నాయి. ఒకనాడు జిల్లాలోని ప్రతి కుటుంబంలో ఒకరన్నా ఏదో ఒక కమ్యూనిస్టు పార్టీలో ఉండేవారు. వుమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఖమ్మం , నల్గొండ జిల్లాలు కమ్యూనిస్టుల ఖిల్లాలు. అటువంటి ఖమ్మం జిల్లాలో ఇప్పుడు కొన్ని ఆశ్చర్యకర పరిణామాలు జరుగుతున్నాయి.

కమ్యూనిస్టు నాయకులు, క్యాడర్ బీజేపీ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా ఆదివాసీలు కమ్యూనిస్టులను వదిలి బీజేపీ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇల్లేందు అసెంబ్లీ కి అదివరకు ప్రాతినిధ్యం వహించిన సిపిఐ మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య త్వరలో బీజేపీ తీర్ధం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మాజీ సిపిఎం నాయకుడు రామచంద్ర నాయక్ బీజేపీ లో చేరటం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుని మాటల ప్రకారం దాదాపు 2500 మంది మాజీ కమ్యూనిస్టు క్యాడర్ ఆగష్టు 18వ తేదీన బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జె పి నడ్డా సమక్షం లో బీజేపీ పార్టీ లో చేరుతున్నట్లు ప్రకటించాడు.

ఈ రాజకీయ పునరేకీకరణ బెంగాల్ లో ఇటీవలకాలం లో జరిగింది. సిపిఎం కి చెందిన అనేకమంది నాయకులు , క్యాడర్ బీజేపీ లో చేరారు. ముఖ్యంగా ఆదివాసీలు , షెడ్యూలు కులాల వాళ్ళు ఎక్కువమంది బీజేపీ గొడుగు కింద చేరారు. బీజేపీ ఒకనాడు బ్రాహ్మణ - బనియా పార్టీగా ముద్రపడింది. అదేపార్టీ ఈరోజు వెనకబడిన కులాలు, షెడ్యూలు కులాలు , ఆదివాసీలను ఎక్కువగా ఆకర్షించటం ఆశ్చర్యమేస్తుంది. ఈ సామాజిక మార్పుని రాజకీయ పండితులు ఎప్పుడూ ఊహించలేదు. బెంగాల్ లో జరిగింది ఓ ఐసోలేటెడ్ సంఘటనగా అనుకున్నారు. మరి ఈరోజు ఖమ్మం లో జరుగుతుంది చూస్తే ఇది ఒక్కచోటే కాదు దేశవ్యాప్త ప్రభావమేమో అని ఆలోచించాల్సి వస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ వైఫల్యం బీజేపీ కి మరింత అనుకూలతగా మారిందని చెప్పొచ్చు. ఇది కేవలం ఖమ్మంకే పరిమితమా లేక తెలంగాణా మొత్తం ప్రభావం చూపుతుందో చూడాలి. అలాగే దీని ప్రభావం ఆంధ్ర కమ్యూనిస్టుల పై కూడా ఉంటుందా? ఏమో రాజకీయ అంచనాలు ఊహకందని విధంగా మారుతున్నాయి. ముందు ముందు తెలుగు నాట రాజకీయాలు అనూహ్యమార్పులకు గురి అయినా ఆశ్చర్యపోనక్కరలేదు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.