ఆంధ్రాలో విప్లవాత్మక నిర్ణయాలు

జగన్ ప్రభుత్వం ఆంధ్రాలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామ సచివాలయాల స్థాపన ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని ఆలోచన. ఎన్టీఆర్ పాలనను మండలాల కు తీసుకొస్తే జగన్ గ్రామాల వరకు తీసుకొచ్చినట్లుగా చెప్పవచ్చు. అంతేకాదు ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగేబదులు ఉద్యోగస్తులే ప్రజలవద్దకు వచ్చేవిధంగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టటం ఓ విప్లవాత్మకమైన చర్యగా చెప్పొచ్చు. మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నిరక్షరాస్యుల సంఖ్య జాతీయ సగటుకన్నాఎక్కువగా ఉండటం దురదృష్టకరం. అక్షరాస్యుల్లో కూడా చాలామంది పేరుకే గానీ పూర్తి గా చదవటం, రాయటం చేయలేనివారే . ఇక అధునాతన సాంకేతికతను ఉపయోగించే వాళ్ళ శాతం బహు తక్కువ. అటువంటప్పుడు ఇంటర్నెట్ లాంటి సాంకేతికతను ఉపయోగించుకొని రోజువారీ పనుల్లో వెసులుబాటు తెచ్చుకోవటం చాలా కష్టం.

ఈ నేపథ్యంలో గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ప్రజల రోజువారీ అవసరాలు తీర్చటంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ ఉపయోగించే విద్యావంతులకు ఇది పెద్ద విషయంగా అనిపించక పోవచ్చు. కానీ గ్రామాల్లో ఇది ఓ పెద్ద గేమ్ చేంజర్ . అయితే దీని ఫలితం విజయవంతంగా అమలుచేయటంపై వుంది. అందరి మనస్సుల్లో తొలుస్తున్న సమస్య ఈ వ్యవస్థలు అవినీతికి, బంధుప్రీతి కి ఆలవాలం కాకుండా ఉంటాయా అనేదే? జవాబుదారీ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తే అంతగా ఇది విజయవంతమవుతుంది. అయితే మనదేశంలో ఇప్పటివరకు దీనిపై ప్రజల్లో విశ్వాసం రాలేదు. కారణం అవినీతిని నిర్మూలించటం ఒక పవిత్ర కార్యక్రమంగా ప్రభుత్వాలు చేపట్టక పోవటం, అవినీతిపరులను రాజకీయనాయకత్వం దూరంగా పెట్టకపోవడం, అవినీతిపరులు శిక్షలు పడకుండా దర్జాగా సమాజంలో తిరగడం, అవినీతిని తగ్గించే పారదర్శక వ్యవస్థలను అమలుచేయకపోవటం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వున్నాయి. కాబట్టి ఈ సంస్కరణ మంచిదయినా అది అమలుపై గట్టిగా జగన్ దృష్టి పెట్టాల్సివుంది.

ఇక రెండోది, మధ్య నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టడం. ఇది కూడా ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పేదప్రజలు మద్యం ప్రభావంతో తమ జీవితాలను ఛిద్రం చేసుకోవటం చూస్తున్నాము. గ్రామాల్లో ఒకనాడు మద్యం షాపులు ఉండేవి కావు. కానీ నేడు మంచినీళ్లు దొరక్కపోయినా మద్యం మాత్రం ఏరులై పారుతుందనేది సత్యం. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని ప్రభుత్వమే తీసుకోవటం, మొత్తం షాపుల సంఖ్యను తగ్గించటం, వాటి పని గంటలు తగ్గించటం, దేవాలయాలు, స్కూళ్ళు ఆసుపత్రుల పరిసరాల్లో మద్యం షాపులు పెట్టకపోవడం , బెల్టు షాపులు మూసివేయటం లాంటి చర్యలు ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే పూర్తి నిషేధం అభాసుపాలవుతుందనేది అనుభవం నేర్పిన పాఠం. కాబట్టి ఇప్పుడు తీసుకున్న నియంత్రణే నిషేధంకన్నా మేలు. దీన్ని పటిష్టవంతంగా అమలుచేస్తే చాలు.

జగన్ తీసుకున్న ఈ రెండు నిర్ణయాలు అన్ని పార్టీలు రాజకీయాలతో సంబంధం లేకుండా మద్దత్తు ఇవ్వాల్సిన అవసరం ఎంతయినా వుంది. ముఖ్యంగా మీడియా పూర్తి ప్రచారం కల్పించాల్సిన అవసరం ఎంతయినా వుంది. దురదృష్టవశాత్తు మన తెలుగు మీడియా సమాజానికన్నా రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు నమ్మినబంటులాగా పనిచేస్తున్నాయి. ఈ రెండు నిర్ణయాల్లో లోపాలు వెతికేముందు ఆ నిర్ణయాలను ఆహ్వానించి ప్రచారం కల్పించాల్సివుంది. ఆ తర్వాత అందులో లోపాలుంటే నిర్మాణాత్మక సలహాలతో ముందుకు రావాలి. కానీ తెలుగులో మీడియామొత్తం పార్టీలవారీగా విడిపోయాయి. ఎక్కువభాగం తెలుగుదేశానికి, చంద్రబాబునాయుడుకి విధేయంగా ఉంటూ ప్రతి ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించటం వలన ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయాయి. అలాకాకుండా మంచిని సమర్ధిస్తూ , లోపాల్ని విమర్శిస్తూ ఉండివుంటే ప్రజల్లో వీళ్లకు విశ్వసనీయత పెరిగివుండేది. ఇప్పుడు ఈ ఛానళ్లు నిజంచెప్పినా వాళ్లపై విశ్వసనీయత లేకపోవటంవలన నమ్మేపరిస్థితి లేదు. ఇప్పటికైనా మీడియా రాజకీయపార్టీల వ్యక్తుల కొమ్ముకాయకుండా ప్రజలకు కొమ్ముకాస్తే సమాజానికి మేలు జరుగుతుంది, అలాగే మీడియాపై ప్రజల్లో విశ్వసనీయత కూడా పెరుగుతుంది.

గ్రామ సచివాలయాల వ్యవస్థ , మద్యం నియంత్రణ విధానంపై ఆంధ్ర ప్రభుత్వ చర్యలను ఆహ్వానిద్దాం, అభినందిద్దాం, అందరం కలిసి మద్దతిద్దాం. కలిసిరండి.

 
 

1 Comments

Write a comment ...
Post comment
Cancel
 1. 4 Oct, 8:16 pm
  Kavi
  Reply

  Let\'s hope for a successful implementation of these steps taken by AP Govt.

  Post comment
  Cancel