ఆంధ్రాబ్యాంక్ హైద్రాబాదు కేంద్రంగా కొనసాగాలి

ఆంధ్రాబ్యాంక్ విలీన సమస్యపై కార్యాచరణ అభిప్రాయ వ్యక్తీకరణకే పరిమితం కాకూడదు. ఇప్పటివరకు దీనిపై జరుగుతున్న పరిణామాలను ప్రజలకు వివరించటానికి ఎక్కువ సమయం గడిపారు. అది అవసరం కూడా. ముఖ్యంగా టీవీ ప్రసార సాధనాలు తమ వంతు పాత్ర బాగానే పోషించాయని చెప్పొచ్చు. ఇది ప్రాధమిక దిశగానే భావించాలి. ఇంతటితోటి మన పాత్ర అయిపోయిందనుకుంటే పొరపాటే. అలాగే ఉద్యోగ సంఘాలు అన్నీ అంత చురుకైన పాత్రపోషిస్తున్నట్లు అనిపించడంలేదు. ఇది వాళ్ళను విమర్శించటానికి ఉద్దేశించలేదు. వాళ్ళను మరింత జాగృతం చేయటానికి మాత్రమే. ఆంధ్ర బ్యాంకు లో ప్రధానంగా రెండు సంఘాలు అత్యధికమంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ముందుగా ఈరెండు సంఘాలు కలిసికట్టుగా కార్యాచరణ చేపట్టాలి. రేపు సిబ్బంది కి సంబందించిన గుర్తింపు పొందిన సంఘం దేశవ్యాప్త ధర్నాలకు పిలుపునిచ్చింది. అభినందనీయం. అదేపని అధికారుల సంఘం కూడా చేస్తే బాగుండేది. అంతరంగికంగా ఇందులోవున్న సాధకబాధకాలు ఏమిటో తెలియదు కాబట్టి ఎవర్నీ విమర్శించదలుచుకోలేదు. కానీ ముందు ముందు ఇలా జరిగేటట్లయితే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం వుంది. ఇప్పటికైనా బ్యాంకులోవున్న అన్ని సంఘాలు కలిసి ఐక్య కార్యాచరణకు పూనుకోవాలని , అది జరగకుండా బయటి ప్రజలకు చెప్పే నైతిక హక్కు కోల్పోతామని మరచిపోవద్దు. ఇది మొట్టమొదటి కార్యాచరణ.

ఇకపోతే ఇప్పటివరకు అభిప్రాయ విస్తరణ దశలో వున్న ఉద్యమాన్ని ప్రత్యక్ష కార్యాచరణ దిశగా మరల్చగలిగితేనే దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకురాగలం. దీనిపై ముందుగా మనకు ఓ స్పష్టత ఉండాలి. ప్రత్యక్ష కార్యాచరణ అంటే కేవలం ప్రదర్శనలు, ఉపన్యాసాలు కాదు. దీన్ని అన్ని రాజకీయ పక్షాల్లోకి బలంగా తీసుకెళ్లగలగాలి. నిన్న చంద్రబాబు నాయుడు లేఖ రాసారు. ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్లు పత్రికా సమావేశం లో మంత్రి వెల్లడించారు. ఈ రెండు లేఖలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున లేఖ రాయటం కొంత ప్రభావాన్ని చూపుతుంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి వుంది. ప్రధాన కార్యాలయం తెలుగు రాష్ట్రాల్లో లేకుండా కేవలం ఆంధ్రాబ్యాంక్ పేరు ఉంచినంత మాత్రాన ఒరిగేదేమీలేదు. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నికూడా కలిసి హైదరాబాద్ ప్రధాన కార్యాలయాన్ని కోల్పోతే వచ్చే నష్టాన్ని గురించి వివరించవలసి వుంది. ఇది తక్షణావసరం. దీనికోసం కొంత చొరవ తీసుకొని పనిచేయాల్సివుంటుంది. ఇందుకు ఒక వ్యక్తి, ఒక సంస్థ సామర్ధ్యం సరిపోదు. ఆంధ్రాబ్యాంక్ శ్రేయోభిలాషులు అందరూ సమిష్టిగా కార్యాచరణకు పూనుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. ముఖ్యంగా సంస్థలన్నీ కలిసి ఈ చొరవ తీసుకోవాలి. రిటైరైన ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి. అయితే వాళ్ళకున్న పరిమితులు అందరికీ తెలిసినవే. అందుకే ఇంకా శక్తి, యుక్తులున్న వ్యక్తులు, సంస్థలూ వీటిని ముందుండి నడిపి అందరినీ కలిపి తీసుకెళ్లగలిగితేనే ఏమైనా చేయగలం.

రాజకీయపక్షాల వ్యక్తిగత ఎజెండా ఇందులోకి జొరబడకుండా జాగ్రత్తపడుతూ అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని వెళ్లే కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలి. అలా జరిగినప్పుడే ఏమైనా సాధించగలం. ఎల్లుండి అంటే 6 వ తేదీ బోర్డు సమావేశం రోజు ఏమైనా కార్యాచరణ చేయగలిగితే సముచితంగా ఉంటుంది. అదేసమయం లో బోర్డు మీటింగు లో ఏం జరుగుతుందో అందరికీ అవగాహన వుంది కాబట్టి కొంత నిరుత్సాహం ఉండటం సహజం. అయితే మనం ఆశాజీవులం. బోర్డు మీటింగు తోనే అంతా అయిపోయినదని భావించకూడదు. చివరిదాకా మన ప్రయత్నం కొనసాగించాలి. ఒకవేళ విలీనాన్ని ఆపలేకపోతే కనీసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. హైద్రాబాదు ప్రధానకార్యాలయాన్ని వుంచుకోగలిగితే కొంతమేర తెలుగురాష్ట్రాలకు మేలుజరుగుతుంది. అయితే ఈ విషయం బోర్డు మీటింగు తర్వాతనే ఆలోచించాలి. కాబట్టి మొత్తం విలీన ప్రక్రియ అయిపోయేవరకు ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ కార్యాచరణ వేసుకోగలిగితే భారీ నష్టాన్ని నివారించవచ్చు. దీనికి ఈ క్రింది కార్యాచరణ స్థూలంగా రూపొందించుకుంటే ప్రయోజనం ఉంటుంది.

1. రాజకీయనాయకులు లేఖరాసేటప్పుడు పేరుతోపాటు హైదరాబాద్ ప్రధాన కార్యాలయాన్ని కొనసాగించాలని కూడా ఖచ్చితంగా స్పష్టం చేయకపోతే మన రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. దీన్ని దృష్టిలో వుంచుకొని రాజకీయనాయకులతో మాట్లాడితే బాగుంటుంది. 2. తెలంగాణ ముఖ్యమంత్రిని , తెలంగాణ రాజకీయ పార్టీల నాయకులను కలిసి వివరించటం తక్షణావసరం. రెండు రాష్ట్రాల రాజకీయ పార్టీలను, ప్రజలను చైతన్యపరచటం చాలా అవసరం. 3. ఉద్యోగసంఘాలన్నీ కలిసి ఐక్య కార్యాచరణకు పూనుకోవాలి. 4. బోర్డు మీటింగు రోజు నిరసన ప్రదర్శనాల్లాంటి కార్యాచరణకు ప్లాన్ చేసుకోవాలి. 5. బోర్డు మీటింగు తర్వాతకూడా కార్యాచరణ కొనసాగించాలి. 6. ఒకవేళ విలీనం తప్పనిసరయితే హైదరాబాద్ ప్రధాన కార్యాలయాన్ని కొనసాగించాలనే ప్రచారాన్ని అందరి రాజకీయనాయకుల ముందుకు తీసుకెళ్లాలి. ముఖ్యంగా ప్రధానమంత్రికి, అమిత్ షా కి దగ్గరగా వుండే బీజేపీ నాయకులతో లాబీ చేయగలిగితే హైదరాబాద్ ప్రధాన కార్యాలయం పై కొంత పునరాలోచించుకొనే అవకాశం వుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదొక్కటే కొంత ఆచరణ సాధ్యంగా , సానుకూలదిశగా కనబడుతుంది.

ప్రస్తుతానికి ఈ కార్యాచరణ తో ముందుకెళితే కొంత ఫలితం వచ్చే అవకాశం వుంది. దీనికి అదనంగా ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి కార్యాచరణ రూపొందించుకోవచ్చు. ఈ దిశగా ఆలోచించండి. చొరవ తీసుకోండి. కార్యాచరణ ప్రారంభించండి. ఫలితంపై ఊహాగానాలు చేసేపని ఆపి ఆంధ్ర బ్యాంకు, తెలుగు ప్రజల ప్రయోజనాలకోసం ముందుకు నడవండి.

ఆంధ్ర బ్యాంకు శ్రేయోభిలాషులుగా ముందుకు నడుస్తారని ఆశిస్తున్నాము.

 

4 Comments

Write a comment ...
Post comment
Cancel
 1. 5 Sep, 12:22 am
  B Ramesh
  Reply

  Rightly said one should take lead we are back you always . hope our andhra bank existencey will be continue

  Post comment
  Cancel
 2. 5 Sep, 6:39 am
  J VENKATA Rathnam
  Reply

  Identity of ANDHRA BANK IS TO BE FAUGHT BY ALL, STAFF AND CUSTOMER WITH HEAD OFFICE IN UNDIVIDED AP. IF NOT DONE THE DEVELOPMENT IN BOTH STATES WILL BE AT RISK. RAISE TO OCCASION NOW.

  Post comment
  Cancel
 3. 5 Sep, 8:55 am
  Satya prasad Potluri
  Reply

  Andhra Bank is having history in both Telugu states and catered the needs of people. The sentiments of Telugu people should be honored and the identity of Bank must be in tact ..

  Post comment
  Cancel
 4. 5 Sep, 12:20 pm
  krishna
  Reply

  well said sir,

  Post comment
  Cancel