అమరావతి రియల్ ఎస్టేట్ ఢమాల్

జగన్ కొన్ని విషయాల్లో మొండిగా వ్యవహరిస్తున్నాడని చెప్పాలి. నిన్నటికి నిన్న కీయ మోటార్ కంపెనీ మొదటి కారు విడుదల ఫంక్షన్ కి డుమ్మా కొట్టాడు. ఇవ్వాళ్ళ వచ్చిన వార్తల్ని బట్టి అమరావతి రాజధాని ప్రణాళికకు సున్నా చుడుతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం పనులన్నీ ఆపటం అందరికీ తెలిసిందే. ఆ ప్రాజెక్టులన్నీ ఇప్పట్లో ప్రారంభిచడని వార్తలు వస్తున్నాయి. ఒక్క సీడ్ ఆక్సిస్ రోడ్డు తప్పితే మిగతావన్నీ అటకెక్కించినట్లు తెలుస్తుంది. అదేగనక నిజమయితే ఇది ఆంధ్ర ప్రజలకి పెద్ద షాక్ అని చెప్పాలి. ఇంతపెద్ద తప్పిదం చేస్తాడని అనుకోవడంలేదు. ఈరోజు టైమ్స్ అఫ్ ఇండియా లో వచ్చిన వార్త నిజమయితే జగన్ రాష్ట్ర ప్రయోజనం కన్నా స్వీయ కక్షసాధింపు ఆలోచనతోనే వెళ్తున్నాడని అనుకోవాలి.

దీనికి రెండు కారణాలు అనుకుంటున్నారు. ఒకటి చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన ఏ పనీ ముట్టుకోవటం ఇష్టంలేకపోవటం. చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పని పూర్తిచేస్తే తర్వాత చంద్రబాబు నాయుడు ఇదంతా తన ఘనతేనని ప్రచారంచేసుకుంటాడని కాబట్టి ఆ ఆలోచనే భరించే స్థితి లో జగన్ లేకపోవటం ఒక కారణం. రెండోది ఆ చుట్టుపక్కల ఒక కులం వాళ్ళు , చంద్రబాబు నాయుడు అనుకూలురు భూములు విపరీతంగా కొన్నారుకాబట్టి వాళ్లకు లాభం చేకూర్చటం ఇష్టంలేకపోవటం రెండో కారణంగా చెబుతున్నారు. జగన్ ఆలోచించే కోణం ఓ చిన్నపిల్లాడి మనస్తత్వం లాగావుంది. ఎవరిమీదో కక్షతో అమరావతి పనులు ఆపేస్తే అది మొదటికే మోసం వస్తుందని గ్రహించటంలేదు. పైకి చెప్పేకారణం అంత డబ్బులు రాష్ట్రం లో లేవని చెప్పటం.

ఒకవైపు డబ్బులు లేవని చెబుతూనే సంక్షేమ కార్యక్రమాలపేరుతో, ప్రభుత్వ ఖర్చులు విపరీతంగా ఖర్చయ్యే విధానాలతో రాష్ట్ర ఖజానాని ఖాళీ చేయటం ఏ విధంగా అర్థంచేసుకోవాలి. ఆర్టీసీ ని విలీనం చేసుకోవటం, సిబ్బంది నియామకాల్లో విచ్చలవిడితనం, భవిష్యత్తు ఆర్ధిక పరిస్థితిపై పెనుభారం పడుతుందని గ్రహించలేకపోవటం దౌర్భాగ్యం. పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకు రిజర్వు చేయటం దూరదృష్టిలేని చర్య. ఉదాహరణకు కియా మోటారు కార్ల కంపెనీని తీసుకుందాం. అందులో ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే ఇవ్వాలంటే ఆ కంపెనీ ని ఇబ్బంది పెట్టిన వారే అవుతారు.

ఈ తప్పుడు పనులకు తోడు రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోవటానికి కారణమయ్యే పని ఇప్పుడు తీసుకుంటున్నాడు. తక్షణం ఆ వార్తలపై వివరణ ఇవ్వకపోతే నిజమేనని అందరూ నమ్ముతారు. అందునా ప్రతిష్టాత్మకమైన పేపరుకూడా. తన కూర్చున్న కుర్చీని తానె నరుక్కుంటున్నాడని అనిపిస్తుంది. ఇప్పటికైనా ఈ ఆలోచనని మానుకొని రియల్ ఎస్టేట్ రంగాన్ని నిలబెడితే మంచిది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.