సీజనల్ వ్యాధులన్ని డెంగ్యూ వ్యాధులు కావు

వాతారవణంలో మార్పులు చోటుచేసుంటున్న సమయంలో సీజనల్ వ్యాధులు ప్రబలటం సాధారణమేనని, ప్రతి జ్వరాన్ని డెంగ్యూ వ్యాధి అంటూ ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు అన్నారు. రాజధాని నగరంలో ప్రబలుతున్న సీజనల్ వ్యాధుల నివారణ, మెరుగైన శానిటేషన్, ప్రభుత్వాసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, విస్తరించాల్సిన సేవలు, రోడ్ల మరమ్మతులు వంటి అంశాలపై ఆయన సోమవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి జీహెచ్‌ఎంసీ కమిషనర్, అదనపు, జోనల్, డిప్యూటీ కమిషనర్లతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి ప్రబలేందుకు కారణమైన దోమల మురుగునీటిలో కాకుండా, మన ఇంట్లో నిల్వ ఉండే మంచినీటిలో ఉత్పత్తి అవుతుందన్న విషయాన్ని గుర్తించి, ప్రతి ఒక్కరూ ఇంట్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాజధాని నగరంలో సీజనల్ వ్యాధుల నివారణ కోసం ప్రత్యేక కార్యచరణను సిద్దం చేయనున్నట్లు తెలిపారు. వీటికి సమాంతరంగా వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలుగా ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. సంవత్సరం పొడువున వివిధ సీజన్‌లలో ప్రబలే వ్యాధులు, వాటి నివారణ, వైద్య శిబిరాలు, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రజలు, జీహెచ్‌ఎంసీ నిర్వర్తించాల్సిన విధులతో కూడిన ప్రత్యేక క్యాలెండర్‌ను రూపకల్పన చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాజధాని నగరంలో పేదలకు కూడా మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు వీలుగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న 106 బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్యను 300కు, అంటే డివిజన్‌కు రెండు చొప్పున పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను త్వరలోనే మంత్రివర్గం ముందు ప్రవేశపెట్టి, సీఎం కేసీఆర్ అనుమతి తీసుకుని, వీటి సంఖ్యను పెంచుతామని వివరించారు. అప్పటి వరకు ప్రస్తుతమున్న బస్తీ దవాఖానాల్లో ఈవెనింగ్ క్లీనిక్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒకవైపు వ్యాధుల నివారణ చర్యలను చేపడుతూనే, వాటికి సమాంతరంగా వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు గాను ప్రతి సర్కిల్‌లో ప్రతి రోజు మూడు అవగాహన శిబిరాలను నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ శిబిరాలతో పాటు ఇప్పటికే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు నిర్థారణ అయిన ప్రాంతాల్లోని కనీసం ఒక ఇంటిని సందర్శించి, డెంగ్యూ వ్యాధి వచ్చే దోమల ఎక్కడ, ఎలా ఉత్పత్తి అవుతోందన్న అంశంపై ప్రజల్లో అవగాహనను పెంపొందించాలని సూచించారు.

మూసీ పరివాహక ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ

రాజధానిలో ఇప్పటి వరకు నమోదైన డెంగ్యూ కేసుల్లో ఎక్కువ మూసీ పరివాహక ప్రాంతంలోనే ఉన్నట్లు గుర్తించామని, ఈ ప్రాంతంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌తో పాటు ప్రైవేటు, కార్పొరేట్ వైద్యులతో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. మూసీ నదిలో ప్రవహిస్తున్న నీటిలో ఎక్కువ మోతాదులో మురుగునీరు కలుస్తుందని, వీటిని శుద్ధి చేసేందుకు త్వరలోనే ఎస్‌టీపీల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.