రాక్షసుడు మూవీ రివ్యూ

నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్,అనుపమ పరమేశ్వరన్, రాజీవ్ కనకాల, శరవణన్, వినోద్ సాగర్, రాధా రవి.
దర్శకత్వం : రమేష్ వర్మ
నిర్మాత‌లు : సత్యనారాయణ కోనేరు
సంగీతం : జిబ్రాన్
రేటింగ్ : 3/5

మాస్‌ ఫాలోయింగ్‌ పెంచుకుందామని రొటీన్‌ సినిమాలను చేస్తూ వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. ఈ సారి మాత్రం క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. ఇంతవరకు సరైన విజయాన్ని అందుకోలేకపోయిన ఈ హీరో.. మొదటి సారి ఓ రీమేక్‌(తమిళ మూవీ రాక్షసన్‌)ను ఎంచుకున్నాడు. రాక్షసుడు చిత్రంతో ఈ శుక్రవారం ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ హీరోకు.. విజయం లభించిందా? లేదా తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:

అరుణ్(బెల్లంకొండ) ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. కుటుంబ పరిస్థితులు, ఒత్తిడుల రీత్యా తన తండ్రి ఉద్యోగమైన పోలీస్ అధికారిగా చేరతాడు. నగరంలో తరచుగా టీనేజ్ అమ్మాయిలు కిడ్నాప్ చేయబడి,చంపబడుతున్న సీరియల్ మర్డర్స్ కేసు చేధించే బాధ్యత అరుణ్ టీంకి దక్కుతుంది. ఈ నేపథ్యంలో అరుణ్ సొంత మరదలు కూడా ఆ కిల్లర్ కారణంగా మరణిస్తుంది. అసలు ఆ కిల్లర్ ఎవరు? అతను టీనేజ్ అమ్మాయిల వరుస హత్యలకు ఎందుకు పాల్పడుతున్నాడు?. అరుణ్ ఆ కిల్లర్ ని ఎలా పట్టుకున్నాడు? అనేది మిగతా కథ.

నటీనటులు

ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్‌.. యాక్షన్‌ సీన్స్‌తోపాటు, ఎమోషనల్‌ సీన్స్‌లోనూ బాగా నటించాడు. ఇంతకుముందు కూడా పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను పోషించినా.. ఈ మూవీలో మాత్రం ఇంటెన్సిటీతో నటించాడు. ఇక టీచర్‌గా కృష్ణవేణి పాత్రలో అనుపమా.. లుక్స్‌తో బాగానే ఆకట్టుకుంది. కనిపించింది తక్కువే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో రాజీవ్‌ కనకాల మెప్పించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో తన అనుభవాన్ని చూపించాడు. రాక్షసుడు పాత్రను తెరపై చూస్తేనే ఆ థ్రిల్‌ను ఫీల్‌ అవ్వొచ్చు. మిగతా పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు మెప్పించారు.

ప్లస్ పాయింట్స్:

కథనం
బెల్లంకొండ శ్రీనివాస్‌ నటన
సంగీతం
థ్రిల్లింగ్‌ అంశాలు

మైనస్ పాయింట్స్:

ఎంటర్‌టైన్మెంట్‌ లేకపోవడం
తమిళ వర్షన్‌ చూసినవారికి థ్రిల్లింగ్‌గా అనిపించకపోవడం

సాంకేతిక విభాగం:

ఇక జిబ్రాన్ అందించిన బీజీఎమ్ సినిమాలోని ఉత్కంఠ కలిగే సన్నివేశాలు గ్రిప్పింగ్ గా సాగడంతో ఎంతో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ఆయన మ్యూజిక్ సన్నివేశాలకు ప్రాణం పోసింది. సినిమాలో నిర్మాణ విలువలు కూడా పర్వాలేదన్నట్లుగా ఉన్నాయి.తమిళ వర్జినల్ వర్షన్ స్ఫూర్తిగా ప్రొడక్షన్ డిజైన్ చేసినట్టున్నారు. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించిన తీరు బాగుంది. అలాగే ఎడిటింగ్ కూడా సినిమాకు తగ్గట్లుగా ఆకట్టుకుంది. సన్నివేశాలు ప్రేక్షకుడికి అనుభూతి పంచడంలో కెమెరా పనితనం ఉపయోగపడింది.

తమిళ మాతృక అయిన రాక్షసుడు మూవీ ఆ ఒరిజినల్ ఫీల్ పోకుండా ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ రమేష్ వర్మ విజయం సాధించారు. కొత్త ప్రయోగాలకు దూరంగా ఒరిజినల్ వర్షన్ ని ఆయన మక్కికి మక్కి దించారు. యాక్షన్ సన్నివేశాలలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ని అద్బుతంగా ప్రెసెంట్ చేశారు. ఎక్కడా నిరాశ కలగకుండా ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించాడు.

తీర్పు:

రెగ్యులర్ కమర్షియల్ అంశాలు ఆశించి సినిమాకు వెళ్లేవారిని ఈ చిత్రం అంతగా ఆకట్టుకోకపోవచ్చు, కానీ థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకుడికి ‘రాక్షసుడు’ చిత్రం మంచి అనుభూతిని పంచుతుంది. ఈ వారానికి రాక్షసుడు మూవీ బెస్ట్ ఛాయిస్ అనడంలో సందేహం లేదు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.